: సొంతిల్లు కట్టుకున్నా, గృహ ప్రవేశానికి అడ్డంకులు... ఏపీలో 'ఆక్యుపెన్సీ' లీల!


మీరు ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొత్తగా ఇల్లు కట్టుకున్నారా? శుభముహూర్తాల వేళ గృహ ప్రవేశం చేసేందుకు సంకల్పించుకున్నారా? ఒక్క క్షణం ఆగండి. రాత్రింబగళ్లు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న మీ ఇంట్లోకి వెళ్లేందుకు ఇకపై సర్కారు అనుమతి తప్పనిసరి. ఇంట్లో గృహ ప్రవేశానికి ముందు పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ అధికారుల నుంచి 'ఆక్యుపెన్సీ సర్టిఫికెట్' తీసుకోవాలి. లేకుంటే భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. గతంలోనే ఈ నిబంధన అమలులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఏపీ ఖజానా నిండుకుంటున్న వేళ, ఆదాయం కోసం వెతుకుతున్న సమయంలో ఈ మార్గం కనిపించింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఇళ్లలో చేరిన వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇక ఈ జరిమానా బారిన పడకుండా ఉండాలంటే, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత, సంబంధిత ఉద్యోగులకు సమాచారమిస్తే, వారు ఇంటి వద్దకు వచ్చి అన్ని అనుమతులు పాటించారా? ప్లాన్ ప్రకారమే ఇల్లు కట్టారా? అన్న విషయాలు పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వాలా? వద్దా? అన్న విషయాన్ని సిఫార్సు చేస్తారు. దీన్ని బట్టి కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత మాత్రమే ఇంటి యజమాని, ఆ ఇంట్లోకి వెళ్లి నివాసం ఉండే అర్హత పొందుతాడు. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు సకాలంలో జారీ అయ్యేలా చూస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, 'అందుకు ఎంత ఇచ్చుకోవాలో' అని ఆలోచించాల్సిన పరిస్థితి సామాన్యులకు తలెత్తుతోంది.

  • Loading...

More Telugu News