: ఓయూ హాస్టళ్లలో మళ్లీ పోలీసుల సోదాలు... 16 మంది విద్యార్థుల అరెస్ట్


గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కొనసాగిన సమయంలో పోలీసులు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో ప్రవేశించి తనిఖీలు చేబట్టేవారు. ఇప్పుడు మరోమారు ఉస్మానియా హాస్టళ్లలో పోలీసులు ప్రవేశించారు. హక్కుల పరిరక్షణ పేరిట కొంతమంది విద్యార్థులు నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ నేపథ్యంలో వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని విద్యార్థులు, అడ్డుకుని తీరతామని గోసంరక్షణ సమితి నేతలు పరస్పర ప్రకటనలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు వర్సిటీలో అనుమతి లేదని నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రంగప్రవేశం చేసిన పోలీసులు రాత్రి పొద్దుపోయిన తర్వాత వర్సిటీ హాస్టళ్లలో ముమ్మరంగా సోదాలు చేశారు. ఈ సందర్భంగా బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమవుతున్న 16 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్సిటీలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News