: జీఎస్టీ అమలుతో తొలి లాభం వాహన కొనుగోలుదారులకు... కార్ల ధరలు కుదేలు!


ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్టీ - గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) అమల్లోకి వస్తే, దాని ప్రభావంతో కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయని ఆటో రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కార్ల ధరలపై వివిధ రాష్ట్రాల పన్నులను బట్టి 30 నుంచి 50 శాతం వరకూ పన్ను భారం పడుతుండగా, అది ఏకీకృత విధానంలో భాగంగా 17 నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీంతో మార్కెట్ వాటాను మరింతగా పెంచుకునే విషయంలో నెలకొనే పోటీలో భాగంగా ధరలు భారీగా తగ్గుతాయని వివరించారు. "జీఎస్టీ అమలైతే తొలి ప్రభావం వాహన రంగంపైనే ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్లు మినహా, చిన్న, మధ్యతరహా వాహనాల ధరలన్నీ దిగివస్తాయి" అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రతినిధి సంజీవ్ ప్రసాద్ వివరించారు. నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు, 1500 సీసీ కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉండే కార్ల ధరలపై ప్రస్తుతం 30.4 శాతం పన్ను కడుతున్నారు. ఇందులో 12.5 శాతం ఎక్సైజ్, 2 శాతం సెంట్రల్ సేల్స్ టాక్స్, ఒక శాతం సహజ ఉత్పాతాల నిధి పన్నుతో పాటు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) 12.5 శాతం కలిసి ఉండటంతో పాటు రాష్ట్ర పన్నులు అదనం. ఇక జీఎస్టీ అమలుతో 17 నుంచి 18 శాతం పన్ను మాత్రం కడితే సరిపోతుంది. అంటే కార్ల ధరలు 12 నుంచి 13 శాతం వరకు తగ్గుతాయన్నమాట. ప్రస్తుతం సెడాన్ లపై 44.5 శాతం, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపై 52 శాతం పన్నులుండగా, జీఎస్టీ అమలైతే సెడాన్ ల ధరలు 4 నుంచి 5 శాతం, ఎస్యూవీల ధరలు 10 నుంచి 12 శాతం తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News