: ఆకలిగా ఉందని విద్యార్థులు చెబితే, స్వయంగా స్పందించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు


వారంతా విద్యార్థులు. తామంతా ఆకలిగా ఉన్నామన్న సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్వయంగా కదిలారు. వారికి ఆహారాన్ని ఇప్పించి ఆకలి తీరేలా చూశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, డెహ్రాడూన్ లోని ఏసీఎన్ స్కూలులో విద్యను అభ్యసిస్తున్నారు. శీతాకాల సెలవులు ఇచ్చేసరికి తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు హరిద్వార్ నుంచి హౌరా వెళ్లే కుంభ్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. పొగ మంచు కారణంగా రైలు చాలా ఆలస్యంగా నడుస్తోంది. ఆ రైల్లో ప్యాంట్రీ కార్ లేదు. వారణాసి సమీపంలోకి వచ్చేసరికి పిల్లలంతా ఆకలితో ఉన్నారు. ఇంకా ఎంతసేపటికి గమ్యం చేరుతామో తెలియని పరిస్థితిలో, ట్విట్టర్ ద్వారా తమ ఆకలి గురించి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ట్వీట్ ను చూసిన సురేష్ ప్రభు, వెంటనే అధికారులకు వారి ఆకలి తీర్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పిల్లలు ట్వీట్ చేసిన నిమిషాల్లో, వారికి ఆహారం, మంచినీరు, కాఫీ తదితరాలు వారి సీట్ల వద్దకు వచ్చేశాయి. "ఇండియా మారుతోంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రతి ఫిర్యాదుపై అధికారులు, మంత్రులు ఇలాగే స్పందిస్తే ప్రజలంతా ఎంతో ఆనందిస్తారు" అని విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుడు అమిత్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ చిన్నారులకు కావాల్సిన ఆహారాన్ని అందించాలని తనకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని స్థానిక చీఫ్ ఏరియా మేనేజర్ రవి ప్రకాష్ చతుర్వేది వివరించారు. రాత్రి 10 గంటల సమయంలో వారికి సాయం చేయాలని తనకు సూచించారని, వెంటనే తాను కావాల్సినవన్నీ తీసుకుని రైలును చేరుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News