: హమాలీలకు మంత్రి హరీశ్ రావు వరాలు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు హమాలీలకు వరాల జల్లు కురిపించారు. ఇవాళ హైదరాబాద్ లోని బోయినపల్లి మార్కెట్ యార్డులో హమాలీ విశ్రాంతి భవనం, 'మన కూరగాయలు' భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.2.5 కోట్లతో ఈ రెండు భవన సముదాయాలు నిర్మించామన్నారు. ఇక యార్డులో పనిచేసే హమాలీలకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని తెలిపారు. అంతేగాక రూ.9 కోట్లతో శీతల గిడ్డంగులు కూడా నిర్మిస్తామని చెప్పారు. కోహెడలో వందెకరాల్లో పండ్ల శీతల గిడ్డంగులు, పటాన్ చెరులో 15 ఎకరాల్లో ఉల్లిగడ్డ మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మార్కెట్ యార్డులో ప్రాథమిక చికిత్సా కేంద్రం నెలకొల్పుతామన్నారు. హమాలీలకు రూ.2 లక్షల బీమా సదుపాయం అమలు చేస్తామని, బోయినపల్లికి వచ్చే కూరగాయల వాహనాలకు పన్ను రద్దు చేస్తామని హరీశ్ ప్రకటించారు. మంత్రి హామీల పట్ల హమాలీలు సంతోషం వ్యక్తం చేశారు.