: మోదీ పాలన భేష్... మనమంతా దేశ భక్తులమే: షారుఖ్
దేశంలో నెలకొన్న అసహనంపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. అన్ని వైపుల నుంచి షారుఖ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. షారుఖ్ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపై ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ షారుఖ్ వివరణ ఇచ్చారు. వాస్తవానికి అసహనం గురించి తనకేమీ తెలియదని... కానీ ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పానని తెలిపారు. తాను లౌకికవాదిని అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని... తన దేశభక్తిని శంకించేవాళ్లు మూర్ఖులు అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కువ దేశభక్తులు, ఎవరు తక్కువ దేశభక్తులు అని చెప్పడానికి ఎలాంటి హేతుబద్ధత లేదని తెలిపారు. మనమంతా దేశభక్తులమే అని అన్నారు. గతంలో తాను చెప్పిన విషయాన్ని నెగెటివ్ గా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ పాలనపై స్పందిస్తూ... మోదీ పాలన చాలా బాగుందని కితాబిచ్చారు.