: కాందహార్ ఎయిర్ పోర్టుపై తాలిబాన్ల దాడి... బుల్లెట్ల వర్షం కురిపించిన ఉగ్రవాదులు
ఆఫ్ఘనిస్థాన్ ప్రధాన నగరం కాందహార్ పై పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తాలిబన్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నగరంలోని ఎయిర్ పోర్టుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. పాకిస్థాన్ లో ‘హార్ట్ ఆఫ్ ఏసిియా’ పేరిట ఆఫ్ఘాన్ కు ప్రాంతీయ సహకారంపై జరగనున్న సదస్సుకు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ బయలుదేరాల్సి ఉంది. ఈ పర్యటనను అడ్డుకునేందుకే తాలిబన్లు కాందహార్ ఎయిర్ పోర్టుపై విరుచుకుపడ్డారు. తొలుత బాంబుల వర్షం కురిపించిన ఉగ్రవాదులు ఆ తర్వాత తుపాకులు చేతబట్టి విమానాశ్రయం వైపు దూసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. పలువురు స్థానికులతో పాటు ప్రయాణికులను కూడా తాలిబన్లు బందీలుగా పట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.