: చింతూరులో కొత్త సైకో... బాణాలు విసురుతూ స్వైర విహారం
మొన్నటిదాకా సైకో సూదిగాడు తెలుగు రాష్ట్రాలను హడలెత్తించాడు. మెరుపు వేగంతో రోడ్డుపై ప్రత్యక్షమయ్యే ఆ సైకో కనిపించిన వారిపై సిరంజీ దాడి చేసి క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యేవాడు. ఈ తరహా దాడులు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కలకలం రేపాయి. ఆ సైకో పోలీసులకు చిక్కకపోయినా, ప్రస్తుతం ఈ తరహా దాడులు తగ్గుముఖం పట్టాయి. సైకో సూదిగాడి దాడులు మొదలైన తూర్పుగోదావరి జిల్లాలోనే తాజాగా మరో సైకో రంగప్రవేశం చేశాడు. జిల్లాలోని చింతూరు మండలం వేగితోటకు చెందిన 30 ఏళ్ల ముత్తయ్య బాణాలు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నాడు. కనిపించిన వారిపై బాణాలు ఎక్కుపెడుతున్నాడు. మొన్నటిదాకా బాగానే ఉన్న ముత్తయ్య ఇటీవల పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడట. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ ఇద్దరిపై బాణాలను సంధించాడు కూడా. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితులనిద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని బంధించేందుకు రంగంలోకి దిగారు.