: అమరావతి నిర్మాణ వ్యయం రూ.27,097 కోట్లు... నిపుణుల కమిటీ అంచనాను వెల్లడించిన కేంద్రం


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇప్పటికే అవసరమైన భూమిని సేకరించిన ఏపీ ప్రభుత్వం, దసరా పర్వదినాన అంగరంగవైభవంగా శంకుస్థాపనను కూడా పూర్తి చేసింది. ఇక భవనాల నిర్మాణానికి సంబంధించి బ్లూ ప్రింట్ రూపకల్పన జరుగుతోంది. ఈ నెలాఖరు నాటికి ఈ పని కూడా పూర్తి కానుంది. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. ఈ క్రమంలో అసలు రాజధాని నిర్మాణానికి ఎంతమేర నిధులు ఖర్చు అవుతాయన్న విషయం అందరి మదిని తొలుస్తోంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ వేదికగా అమరావతి నిర్మాణ వ్యయాన్ని రూ.27,097 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు తాము నియమించిన నిపుణుల కమిటీ వ్యయానికి సంబంధించి రూపొందించిన నివేదికను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌధరి పూర్తి స్థాయిలో చదివి వినిపించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంధించిన ప్రశ్నకు స్పందించిన చౌధరి రాజధాని నిర్మాణ వ్యయాన్ని అంశాల వారీగా విడమర్చి మరీ చెప్పారు. అమరావతిలో భవన నిర్మాణాలకు రూ.10,519 కోట్లు, రాజధాని ప్రాంత మౌలిక వసతులకు రూ.1,536 కోట్లు, నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.5,861 కోట్లు, నగర మౌలిక సదుపాయాల విస్తరణ, అభివృద్ధికి రూ.9,181 కోట్లు అవసరమవుతాయని నిపుణుల కమిటీ తేల్చిందని చౌదరి చెప్పారు.

  • Loading...

More Telugu News