: యూపీ సీఎం అభ్యర్థిగా వరుణ్ గాంధీ?... బీజేపీ అగ్రనేతల యోచన


బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ, అందుకు గల కారణాల విశ్లేషణలో తలమునకలైంది. మహా కూటమి పేరిట బరిలోకి దిగిన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్ ను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే బీజేపీ తన సీఎం అభ్యర్థి పేరును ప్రకటించేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఆ రాష్ట్రంలో పర్యటించినా ఫలితం లేకపోయింది. ఇక దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రంగా పరిగణిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2017లో జరగనున్నాయి. బీహార్ కంటే యూపీలో బీజేపీ బలం బాగానే ఉంది. అయితే, బీహార్ లో మాదిరిగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా బరిలోకి దిగితే ఇబ్బందులు తప్పవన్న భావన ఆ పార్టీ అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది. అంతేకాక ఇప్పటికే యూపీ సీఎంగా ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ దూసుకెళుతున్నారు. మరోవైపు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి రూపంలో పెను ముప్పే పొంచి ఉందని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రభావమే చూపనున్నారు. ఈ క్రమంలో వీరందరినీ నిలువరించి ఎన్నికల్లో సత్తా చాటాలంటే, ముందుగానే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించాలని బీజేపీ నేతలు దాదాపుగా నిర్ణయించారు. ఈ పేరు ఎవరిదైతే బాగుంటుందన్న కోణంలో యోచించిన ఆ పార్టీ అగ్రనేతలకు మేనకా గాంధీ కుమారుడు, సుల్తాన్ పూర్ ఎంపీ వరుణ్ గాంధీ కనిపించారు. యువకులైన అఖిలేశ్, రాహుల్ గాంధీలను యువరక్తంతో ఉరకలెత్తే వరుణ్ గాంధీతోనే ఎదుర్కొనే అవకాశాలుంటాయన్న కోణంలో వారు లెక్కలేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. కొందరు నేతలైతే వరుణ్ ను మించిన ప్రత్యామ్నాయం మరేదీ లేదని కూడా చెబుతున్నారు. దీంతో యూపీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా వరుణ్ గాంధీ రంగంలోకి దిగనున్నారన్న ఊహాగానాలు ఆ పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News