: మేయర్ దంపతుల కేసులో నిందితులకు శిక్ష పడే అవకాశం లేదా?


చిత్తూరు మేయర్ దంపతులు కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో నిందితులకు శిక్ష పడే అవకాశం లేదా? అంటే అవుననే అంటున్నారు న్యాయనిపుణులు. కేసును ఛేదించిన పోలీసులు మాత్రం నిందితులు తప్పించుకోకుండా చూసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది? అనే దానిపై ఓ చిన్న విశ్లేషణ... కఠారి అనురాధ, మోహన్ దంపతులను హత్య చేసిన నిందితులు అదే భవనంలోని బాత్రూంకి వెళ్లి చేతులు, ఆయుధాలు శుభ్రం చేసి, వాటిని అక్కడే పడేసి వెళ్లిపోయారు. దీంతో వారి వేలి ముద్రలు దొరకలేదు. ఈ కేసులో నిందితులను పోలీసులు పక్కా సాక్ష్యాలతో అరెస్టు చేయలేదు. నిందితులే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయారు. దీంతో కేసు విచారణ సందర్భంగా ప్లేటు ఫిరాయించే అవకాశం ఉంది. తమపై అనుమానం వచ్చినందున, తప్పు చేయకపోయినప్పటికీ ఇబ్బందులు లేకుండా లొంగిపోయామని వాదించే అవకాశం ఉంది. అలాగే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా వారు బెదిరించి, హింసించి ఇప్పించినవని వాదించే అవకాశం కూడా ఉంది. అలాగే హత్య జరిగిన నవంబర్ 17కి 15 రోజుల ముందు నుంచే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలు పని చేయడం మానేశాయి. ఇక పట్టణంలో పోలీసులు అమర్చిన సీసీ కెమెరాలు మరి కొద్ది రోజుల్లో పని చేయనున్నాయి. దీంతో నిందితులు తప్పించుకుంటుండగా రికార్డయిన ఫుటేజీ లేదు. ఇకపోతే మేయర్ దంపతుల హత్యను ప్రత్యక్షంగా చాలా మంది చూశారు. వీరంతా నిందితులను గుర్తుపట్టినట్టు చెప్పారు. అయితే వీరిలో ఎంత మంది విచారణలో సహకరిస్తారు? అనేది చెప్పడం కష్టమే. ఎందుకంటే నిందితులు ఎటువంటి వారో సాక్షులకు తెలుసు కాబట్టి ముందుకు రావడం కష్టమేనని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ నిందితుల బంధువులు ఎవరైనా ప్రత్యక్షసాక్షిగా ఉంది ఉంటే న్యాయస్థానంలో సాక్ష్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చి ఉండేవారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడే హతుల బంధువు కావడం విశేషం. దీంతో అక్రమ ఆయుధాల కేసు, ఎన్ ఫోర్స్ మెంటు శాఖలు చేపట్టే విచారణలో ఆర్థిక విషయాలు, ఆయుధాలు ఆనుపానులు బయటికి వస్తాయని భావిస్తున్నారు. అయితే ఆయుధాలు చింటూ రాయల్ నివాసంలో స్వాధీనం చేసుకున్నప్పటికీ అతని పరోక్షంగా వాటిని స్వాధీనం చేసుకోవడం పోలీసులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాగే ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ కూడా చేపట్టే దర్యాప్తు ఎంత మేరకు ఫలప్రదమవుతుందనేదని పోలీసులు ఊహించలేకపోతున్నారు. అయితే చింటూ రాయల్ కు ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని మాత్రం తాపత్రయపడుతున్నారు. మరి విచారణలో పోలీసులదా? లేక చింటూ రాయల్ దా? ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News