: ఆ కాలనీలోకి పది అడుగుల మొసలి వచ్చింది!
పది అడుగుల పొడవు, 250 కిలోల బరువున్న ఒక మొసలి మురుగుకాల్వలో దర్శనమిచ్చిన సంఘటన మంగళవారం నాడు మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మనూరు మండలం ఎన్జీ హుక్రానా శివార్లలోని ఎస్సీ కాలనీలో ఉన్న మురుగు కాల్వలో ఓ మొసలి కనపడింది. కొంచెం సేపు అది అక్కడే ఉంది. ఆ తర్వాత స్థానిక రైతు నర్సింహారెడ్డి చెరుకు తోటలోకి ప్రవేశించింది. ఇదంతా గమనిస్తున్న గ్రామస్థులు ఈ సమాచారాన్ని నారాయణ ఖేడ్ అటవీశాఖ అధికారులకు చెప్పారు. వన్యప్రాణుల విభాగానికి చెందిన అధికారులు ఇక్కడికి చేరుకుని ఆ మొసలిని బంధించారు. సంగారెడ్డి వద్ద ఉన్న మొసళ్ల సంరక్షణా కేంద్రానికి దీనిని తరలించారు. ఇలా జనావాసాల్లోకి తరచుగా మొసళ్లు వస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. మంజీరా నదిలో నీళ్లులేకపోవడంతో జల చరాలన్నీ బయటకు వస్తున్నాయని, దీంతో నదీ పరీవాహక ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లోకి ఇవి వస్తున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.