: చీకటే వారికి నేస్తం... వెలుగు వారి పాలిట శాపం!
సూర్యరశ్మి అందరికీ డి విటమిన్ ను ప్రసాదించి, రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అలా అందరికీ వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడు ఓ ఇద్దరు పిల్లల పాలిట మాత్రం శాపంగా మారాడు. ఇటీవల వచ్చిన 'సూర్య వర్సెస్ సూర్య' తెలుగు సినిమాను పోలిన ఈ కథ, ఉత్తరాఖండ్ లోని చమోలీకి చెందిన రుచి (16), విజయ (14) అనే అక్కాచెల్లెళ్లది. వీరిని అంతుపట్టని వ్యాధి పట్టిపీడిస్తోంది. వీరిద్దరూ ఇంట్లో చీకట్లో ఉన్నంత సేపూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటారు. అందర్లా ఆడుకుందామని పొరపాటున బయటికి వచ్చారా, ఇక అంతే... మృత్యుముఖంలోకి వెళ్లి వచ్చినట్టే! ఎందుకంటే, సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు వీరిని తాకితే చాలు, స్పృహ తప్పి పడిపోతారు. నాలుగైదేళ్లుగా వీరిది ఇదే పరిస్థితి, నిరుపేద కుటుంబానికి చెందిన రుచి, విజయలకు మెరుగైన వైద్య చికిత్స చేయించే స్థోమత లేకపోవడంతో వారిని ఇంటికే పరిమితం చేశారు. కేవలం ఐదోతరగతి వరకే చదివించారు. వారి తల్లిదండ్రులిద్దరికీ వయసు పైబడింది. దీంతో కుటుంబ పోషణాభారం మొత్తం వారి కుమారుడి భుజాలపై పడింది. అందుకే, తమను ఎవరైనా ఆదుకుంటారేమో అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.