: పురుషుల బలహీనతను సొమ్ము చేసుకుని వ్యూహాలు రచిస్తున్న ఐఎస్ఐ
పురుషుల బలహీనతను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ లక్ష్యం చేసుకుని వ్యూహాలు రచిస్తోంది. భారత్ లోని పురుషుల్లో ఉండే సాధారణ బలహీనతను ఐఎస్ఐ బలంగా మార్చుకుంటోంది. పురుషుల బలహీనతలను సొమ్ము చేసుకుని భారత్ లో రహస్యాలను ఛేదించేందుకు మహిళా జీహాదీలను రంగంలోకి దించింది. పాక్ నుంచి వారిని రంగంలోకి దించితే అనుమానం వచ్చే ప్రమాదం ఉందని భావించిన ఐఎస్ఐ నేపాల్ లోని తమ కేంద్రాల నుంచి వారిని రంగంలోకి దించింది. తాజాగా వెలుగు చూస్తున్న ఐఎస్ఐ నెట్ వర్క్ పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు నివ్వెరపోయే నిజాలు వెలికితీస్తున్నారు. 2014 ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో నేపాల్ సరిహద్దుల్లోని ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరు భారతీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. వీరిలో ఒకరిని మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన శివ్ నారాయణ్ చంద్రవంశ్ (43)గాను, మరొకరిని అర్జున్ మాలవ్య (35) గాను గుర్తించారు. విచారణ సందర్భంగా వారిద్దరూ మహిళా ఐఎస్ఐ ఏజెంట్ జయ మిశ్రాతో సంబంధాలు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. అంతే కాకుండా, మహిళా గూఢచారులు ఇండోపాక్ సరిహద్దుల్లోని గుస్సేన్ వాలా ప్రాంతాన్ని రెండుసార్లు సందర్శించినట్టు తేలింది. జయ మిశ్రా పేరు గల ఐఎస్ఐ ఏజెంట్ పాకిస్థాన్ లోని లాహోర్ లో నల్లతేళ్లతో ఔషధాలు తయారు చేసే కేంద్రాన్ని నడుపుతున్నట్టు వారు వెల్లడించారు. భారత్ లోని రహస్య ప్రాంతాల గుట్లుమట్లు తెలుసుకోవాలని భావించిన ఐఎస్ఐ, స్త్రీల బలహీనత ఉన్నవారిని గుర్తించి ఉచ్చులోకి లాగేందుకు మహిళా జీహాదీలను రంగంలోకి దించుతోంది. ఇందులో భాగంగానే జయ మిశ్రా... శివ్ నారాయణ్, అర్జున్ లతో సంబంధాలు పెట్టుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి ఆపరేషన్ లో మరింత మంది మహిళా జీహాదీలను రంగంలోకి దించినట్టు పోలీసులు భావిస్తున్నారు.