: గాన గంధర్వుడు ‘ఘంటసాల’కు మ్యూజియం
గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజియంను విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ మ్యూజియం తయారవుతుందని ఏపీ సర్కార్ పేర్కొంది. ఘంటసాల కుటుంబ సభ్యులు, అభిమానులు, తదితరుల విన్నపం మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ కల్చరల్ విభాగం అధ్యక్షుడు డి.విజయ భాస్కర్ మాట్లాడుతూ, ఘంటసాల 94వ జయంతి నిర్వహించే నాటికి ఈ మ్యూజియంను సిద్ధం చేస్తామని అన్నారు. ఘంటసాల ఉపయోగించిన వస్తువులను తమకు అందజేస్తామని ఆయన కుటుంబసభ్యులు తమకు చెప్పారని అన్నారు. గవర్నమెంట్ మ్యూజిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న మ్యూజియంలో ఆ వస్తువులను ఉంచుతామన్నారు. కాగా, గత శుక్రవారం నాడు ఘంటసాల 93వ జయంతి సందర్భంగా ఏపీ కల్చరల్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది.