: జేఎన్టీయూ (హెచ్)లో సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక కోర్సు
సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక కోర్సును హైదరాబాదు జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్ టీయూ) త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ అంశంపై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టాలనుకున్నట్లు జేఎన్టీయూ(హెచ్) రిజిస్ట్రార్ ఎన్.యాదయ్య పేర్కొన్నారు. వచ్చే సెమిస్టర్ నుంచి ఈ కోర్సును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సైబర్ సెక్యూరిటీ పాఠాలు బోధించే నిమిత్తం జేఎన్టీయూ అఫిలియేటెడ్ కళాశాలలకు చెందిన సుమారు 55 మంది ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తామన్నారు. టీసీఎస్, విప్రో వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన ఐటీ ప్రొఫెనల్స్ ఈ శిక్షణ ఇస్తారన్నారు. ఇండస్ట్రీల డిమాండ్ మేరకు ‘అసోసియేట్ సెక్యూరిటీ’ కోర్సును కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ‘ప్రతిదీ డిజిటలైజ్ అయిపోతున్న కాలమిది. సంబంధిత సమాచారాన్ని భద్రంగా కాపాడుకోవడమే కాకుండా రక్షణ కూడా అవసరం. ఆ అవసరం రానురాను మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ పాత్ర ఎంతో ఉంటుంది. కనుక, ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి’ అని తెలంగాణ ఐటీ అసోసియేషన్(టీఐటీఏ) అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్ థాళా పేర్కొన్నారు.