: చావలేక అడ్డమైన 'గడ్డి' తింటున్నారు!
వరదలు వచ్చి ముంచేయలేదు కానీ, అక్కడ జీవనం దుర్భరంగా మారింది. అక్కడి వారి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోకమానదు. ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా కరవు కరాళనృత్యం చేస్తోంది. దీంతో అక్కడి వారు కన్నతల్లిని, ఉన్న ఊరిని వదల్లేక దుర్భర జీవితం గడుపుతున్నారు. పంటలు పండక, ఆదాయ వనరుల్లేక గ్రామీణ ప్రాంత వాసులు దుర్భరమైన జీవనం గడుపుతున్నారు. దీంతో బతకడానికి గడ్డి, కలుపు మొక్కలతో చేసుకున్న రోటీలు తింటూ బతుకుతున్నారు. వారు రోటీలు తయారు చేసుకునే విధానం కూడా చిత్రంగా ఉంటుంది. ఎండినగడ్డి మొక్కల (ఫికార్) ను కోసుకుని వాటిలోని విత్తనాలు ఇంటికి తీసుకెళ్తారు. ఆ విత్తనాలు రోకట్లో దంచి పిండిలా తయారు చేస్తారు. ఈ పిండితో రోటీలు చేసుకుని పొయ్యిమీద కాల్చుకుని తింటారు. అదే ప్రాంతంలో లభించే సమాయ్ మొక్కల ఆకులను సేకరించి, నీళ్లలో ఉప్పు, కారం వేసి బాగా ఉడికించి కూరగా వినియోగిస్తున్నారు. అసలు ఇలాంటి ఆహారాన్ని ఎవరైనా తింటారా? కానీ అక్కడి వారు ఇదే ఆహారాన్ని మహా ప్రసాదంలా తింటారు. పేదరికం కారణంగానే ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారని గ్రహించిన యూపీ ప్రభుత్వం బుందేల్ ఖండ్ ప్రాంతాంలో ఆహారభద్రత చట్టాన్ని అమలు చేయాలని రెండు నెలల క్రితం నిర్ణయించింది.