: తొలిసారిగా జీవితంలో భయపడ్డా: సినీ హీరో సిద్ధార్థ్
దాదాపు వారం రోజుల క్రితం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరాన్ని ముంచెత్తిన వరదలతో తాను జీవితంలో తొలిసారిగా అత్యంత భయపడ్డానని సినీ హీరో సిద్ధార్థ్ చెప్పారు. వరదల కారణంగా ఆయన ఇల్లు ఒక ఫ్లోర్ మునిగిపోయిన సంగతి తెలిసిందే. వరద బీభత్సం సద్దుమణిగాక ఓ టీవీ చానల్ కు సిద్ధార్థ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. "నా ఇల్లు పూర్తిగా కోల్పోతానేమో అని తొలిసారిగా భయపడ్డా. మూడు స్టూడియోలు, మూడు కార్లు నీట మునిగాయి. నా పరిస్థితే ఇలా ఉంటే, మధ్య తరగతి, పేదలు ఇంకా ఎంత కోల్పోయి ఉంటారో! గత ఆరు రోజులుగా నేను ఇంట్లో లేను. నీటిలో ఆరు రోజుల పాటు నా ఇల్లు మునిగిపోయింది. కరెంటు కూడా గత సాయంత్రమే వచ్చింది. ఇంటికి నేనూ నిన్ననే వచ్చాను" అని వివరించాడు. ఓ ప్రకృతి ఉత్పాతం ఎంతటి భయాన్ని పుట్టిస్తుందో తొలిసారిగా చూశానని, అయితే, చెన్నైని ఆదుకునేందుకు బాధితుల కన్నా కార్యకర్తలు అధికంగా కనిపిస్తుండటం శుభపరిణామమని వ్యాఖ్యానించాడు. సామాజిక మాధ్యమాల వల్లే ఇది సాధ్యమైందని, ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని తెలిపాడు.