: తనదాకా వచ్చాక కదిలిన నితిన్ గడ్కరీ!
దేశ రాజధానిలో ట్రాఫిక్ సమస్య ఎంత జటిలంగా ఉందో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి స్వయంగా తెలిసివచ్చింది. గత రాత్రి రోడ్డుపై ట్రాఫిక్ జాం కారణంగా గడ్కరీ కారు రెండు గంటల పాటు నడిరోడ్డుపై ఉండిపోవడంతో, ఆయన ఆఘమేఘాల మీద కదిలారు. సమస్యకు పరిష్కారమేంటో 24 గంటల్లో కనుగొనాలని అధికారులను ఈ ఉదయం ఆదేశించారు. "ఢిల్లీ ట్రాఫిక్ ను పరిశీలిస్తున్నాం. మరికాసేపట్లో నివేదిక వస్తుంది. ఎక్కడెక్కడ సమస్య అధికంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విషయమై ఢిల్లీ ప్రభుత్వంతో చర్చిస్తాం. నేను హామీ ఇస్తున్నా, కేజ్రీవాల్ ప్రభుత్వంతో కలసి వచ్చే ఏడాది వ్యవధిలో ఢిల్లీలో ట్రాఫిక్ సమస్యలను సగానికి తగ్గిస్తాం. కాలుష్యాన్ని నివారించే చర్యలు చేపడతాం" అని కొద్దిసేపటి క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ వ్యాఖ్యానించారు. కాగా, నిన్న ప్రజల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం ఐదు గంటల వ్యవధిలో దాదాపు 25 వేల వివాహాలు జరగడమేనని తెలుస్తోంది. కాగా, ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల సరి, బేసి సంఖ్యల ఆధారంగా, ఢిల్లీలో రోడ్లపైకి కార్లను అనుమతించేలా జనవరి 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు కేజ్రీవాల్ సర్కారు గతవారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.