: భార్యా భర్తల మధ్య రాకూడని మాటలివే!
పండంటి కాపురం పదికాలాలు నిలవాలంటే, భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒకచోట తగ్గాల్సి వస్తుంది. ఏదైనా సమస్య లేక మరేదైనా వివాదం తలెత్తిన సమయంలో ఎంత త్వరగా ఒకరు తగ్గితే అంత త్వరగా తిరిగి దగ్గరైపోవచ్చు. దాంపత్యంలో ఇద్దరి మధ్యా ఎంత చనువున్నా కొన్ని అనకూడని మాటలూ ఉన్నాయి. * జీవిత భాగస్వామితో ఏదైనా చిన్న గొడవ వచ్చిన వేళ సాధారణంగా వినిపించే పదం 'నువ్వెప్పుడూ ఇంతే... ఇట్లాగే చేస్తుంటావు. ఇక మారవా?' అంటుంటారు. ఇటువంటి మాటల వల్ల అవతలి వారు ఆత్మన్యూనతలో పడిపోతారు. పొరపాటు చేసున్నా, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఆ పని తాను చేయలేదని చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఇటువంటి సూటి పోటి మాటల బదులు, ఆ పని వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయన్నది విడమరిచి చెబితే సరిపోతుంది. * ఇక వివాదం వచ్చిన వేళ వినపడే మరో సాధారణ మాట "నీలాగే మీ వాళ్లు కూడా... వాళ్లూ ఇంతే...". పురుషుడైనా, స్త్రీ అయినా తన అత్తింటి వారిని దూషించడం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అత్తింటి వారి తప్పు వాస్తవమే అయినా, ఈ తరహా వ్యాఖ్యలు అవతలి వారి మనస్సును బాధిస్తాయన్న విషయం మరువకండి. * మరో ముఖ్యమైన విషయం, జీవిత భాగస్వామి వ్యక్తిత్వం మారిందని చెబుతూ "ఒకప్పుడు బాగున్నావు. ఇప్పుడు మారిపోయావు. అప్పట్లో నన్నెంతో బాగా చూసుకున్నావు. ఇప్పుడు మాట్లాడేందుకు కూడా ఆలోచిస్తున్నావు"... ఈ మాటలు తరచూ భార్య నుంచి భర్తకు ఎదురవుతుంటాయి. ఈ తరహా మాటల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి. ఇటువంటి మాటలు ఎదురైనప్పుడు, బిజీ జీవితం, దైనందిన అవసరాలు, చేస్తున్న ఉద్యోగంలో పని ఒత్తిడి ఎలా ఉన్నాయన్న విషయం విడమరిచి చెబితే, భాగస్వామి త్వరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక వీలైనప్పుడు ఓ జాలీ ట్రిప్ వేసుకుంటే, ఇటువంటి మాటలే వినపడవు. * దంపతుల మధ్య దూరాన్ని పెంచే మరో మాట "ఎప్పుడూ ఇలానే చేస్తావ్, ఇలానే అంటావ్... అంతకుమించి ఏముంది?"... ఈ తరహా వ్యాఖ్యల వల్ల దూరం పెరుగుతుందే తప్ప తగ్గదు. వాదన పెంచడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండక పోగా, మనసులు మారిపోయే ప్రమాదమూ ఉంది. ఇక చాలా విషయాలను అప్పటికప్పుడు మరచిపోతే ఏ సమస్యా ఉండదు. అన్ని సమస్యలకూ పరిష్కారాలు అప్పటికప్పుడు దొరకవు. కొన్నింటికి కాలమే పరిష్కారం చూపుతుందని కూడా. నమ్మి ముందుకు సాగితే, కాపురం పదికాలాలు నిలుస్తుందనడంలో సందేహం లేదు.