: మరో సాహసం చేయనున్న మోదీ... పాక్ సరిహద్దు వద్ద టెంటులో ప్రధాని బస
భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... ప్రధాని హోదాలో తొలి దీపావళిని పురస్కరించుకుని భారత సైనికులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న జమ్మూ కాశ్మీర్ కు వెళ్లారు. రెండో దీపావళిని ఆయన పంజాబ్ లోని అమృత్ సర్ లో సైనికులతో జరుపుకున్నారు. ఈ రెండు సందర్భాల్లో ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో ఆయన ధైర్యంగా సంచరించారు. తాజాగా మోదీ మరో సాహసానికి సిద్ధమయ్యారు. రాష్ట్రాల డీజీపీ సమావేశాలను పాకిస్థాన్ సరిహద్దు వద్ద నిర్వహించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు తొలి రోజు నుంచి చివరి రోజు దాకా మోదీ హాజరుకానున్నారు. మూడో రోజు సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేస్తారట. పాక్ సరిహద్దును ఆనుకుని తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని రాణా ఆఫ్ కచ్ వద్ద జరగనున్న ఈ సమావేశాల్లో, అక్కడే సైన్యం ఏర్పాటు చేసే టెంట్లలో మోదీ బస చేస్తారట. ఈ నేపథ్యంలో రాణా ఆఫ్ కచ్ ను ఆ మూడు రోజుల పాటు ‘నో ఫ్లయింగ్ జోన్’గా సైన్యం ప్రకటించనుంది. డ్రోన్ ల సంచారాన్ని కూడా నిషేధించారు. ఈ నెల 18న ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.