: కోర్టు వాయిదాకు డుమ్మా కొట్టిన సోనియా, రాహుల్!... అభిషేక్ సింఘ్వీ హాజరు
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నేటి ఉదయం ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు వాయిదాకు డుమ్మా కొట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడా తదితరులు నేటి కోర్టు విచారణకు హాజరుకావాల్సి ఉంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుతో పాటు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న సోనియా, రాహుల్ గాంధీల పిటిషన్లను నిన్న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నేడు జరగనున్న విచారణకు హాజరయ్యే నిమిత్తం సోనియా, రాహుల్ లు ట్రయల్ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. అయితే నేటి ఉదయమే రాహుల్ గాందీ పుదుచ్చేరి పర్యటనకు వెళ్లిపోయారు. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ సోనియా గాంధీ కూడా కోర్టుకు వెళ్లలేదు. కాంగ్రెస్ పార్టీ నేతల తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సంఘ్వీ కోర్టుకు వెళ్లారు. ఇక సోనియా, రాహుల్ లపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సాహంగా కోర్టుకు వచ్చారు. తన న్యాయవాదులతో పాటు ముఖ్య అనుచరులతో కలిసి ఆయన కోర్టుకు వచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సోనియా, రాహుల్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, వారు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు.