: కోర్టు వాయిదాను విస్మరించి... పుదుచ్చేరి బయలుదేరిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసిన నేషనల్ హెరాల్డ్ కేసును ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంతగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుతో పాటు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలు దాఖలు చేసిన పిటిషన్లను నిన్న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి విచారణకు సోనియా, రాహుల్ లు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే కోర్టు విచారణను అంత సీరియస్ గా పరిగణించని రాహుల్ గాందీ ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ మేరకు నేటి ఉదయం పుదుచ్చేరి బయలుదేరి వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఆయన బాదితులను పరామర్శిస్తారు. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులోనూ అనుకూలంగా తీర్పు రాని పక్షంలో సోనియా, రాహుల్ గాంధీలు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. మరి ఈ వ్యవహారాలన్నింటినీ పక్కనబెట్టేసిన రాహుల్ గాంధీ పుదుచ్చేరి వెళ్లిపోయారు. ఒకవేళ కోర్టుకు హాజరుకావాల్సి వస్తే, ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారోనన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.