: ఏడేళ్ల కనిష్ఠానికి క్రూడాయిల్... యూఎస్ మార్కెట్లో భయాలు!
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఏడేళ్ల కనిష్ఠానికి చేరడంతో, అమెరికన్ స్టాక్ మార్కెట్లో భయాందోళన నెలకొంది. ముడిచమురు ధరలు ఇదేలా పతనాన్ని కొనసాగిస్తే, ఈక్విటీ, బాండ్ మార్కెట్ కుదేలవుతుందని నిపుణులు భావిస్తున్నారు. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారలుకు 41.20 డాలర్లకు పడిపోయింది. ఫిబ్రవరి 2009 తరువాత ముడి చమురు ధర ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. చమురు ఉత్పత్తిని తగ్గించేది లేదని ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్) స్పష్టం చేయడమే ధరల తాజా పతనానికి కారణం. ఇదే సమయంలో బలపడుతున్న అమెరికన్ డాలర్ కారణంగా, క్రూడాయిల్ పొజిషన్స్ నిలుపుకునే పరిస్థితి లేదని ట్రేడర్లు భావిస్తున్నారు. కాగా, యూఎస్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే 1.70 డాలర్లు తగ్గి 38.27 డాలర్లకు చేరింది. ముడి చమురుతో పాటు సహజవాయువు ధరలూ 4 శాతం మేరకు పడిపోయాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఎస్అండ్పీ 500 సూచికలు 0.91 శాతం నష్టపోయాయి. నాస్ డాక్ సూచిక 0.78 శాతం దిగజారింది. అమెరికాలో నెలకొన్న పరిస్థితి యూరప్ మార్కెట్ కు లాభాలను తెచ్చిపెట్టింది. యూరో బలహీనంగా ఉండటంతో యూరోపియన్ షేర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇదే ప్రభావం భారత స్టాక్ సూచికలపైనా కనిపిస్తోంది. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 45 పాయింట్లు నష్టపోయి 25,485 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.