: కాల్ డ్రాప్ అయితే రూ. 1 ఇవ్వాల్సిందే... రోజుకు మూడుసార్లకు మాత్రమే!
జనవరి 1 నుంచి కాల్ డ్రాప్ అయితే, కస్టమర్ కు రూ. 1 చెల్లించాల్సిందేనని టెలికం కంపెనీలకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. అయితే, ఈ పరిహారం రోజుకు రూ. 3కు మాత్రమే పరిమితం చేసింది. కాల్ డ్రాప్స్ పెరిగిపోతున్న వేళ, ఈ నిబంధన అమలు చేస్తే, తాము భారీగా నష్టపోవాల్సి వుంటుందని టెలికం సంస్థలు గగ్గోలు పెడుతున్నప్పటికీ, సాంకేతికతను అప్ డేట్ చేసుకోవాల్సిందేనని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వ్యాఖ్యానించారు. పరిహారం నిబంధన అమలు తేదీని మార్చడం లేదా రద్దు చేయడమన్న ప్రశ్నే తలెత్తబోదని ఆయన అన్నారు. తాము అన్ని విషయాలనూ పరిశీలించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాల్ డ్రాప్ సమస్యను పరీక్షించేందుకు అహ్మదాబాద్, ఇండోర్, సూరత్, భువనేశ్వర్, కోల్ కతా నగరాలను జోడించామని, ఈ నివేదిక వచ్చాక దాన్ని టెలికం సంస్థలకు అందిస్తామని ఆయన తెలిపారు.