: టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసులో బాగ్దాదీ!...డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడుతున్న 'ఐఎస్' చీఫ్
ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) చీఫ్ అబూ బకర్ ఆల్ బగ్దాదీ అరుదైన రికార్డును సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో కరుడుగట్టిన ఉగ్రవాదిగా బాగ్దాదీపై అగ్రరాజ్యం ముద్ర వేసింది. అయితే ఆ దేశానికి చెందిన ప్రముఖ పత్రిక ‘టైమ్స్ మేగజీన్’ మాత్రం బాగ్దాదీలోని సత్తాను కీర్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వ్యక్తి ఎవరన్న విషయాన్ని తేల్చనున్న ఆ మేగజీన్, సదరు వ్యక్తికి ‘టైమ్స్ పర్సన్ ఆప్ ది ఇయర్’ అవార్డును కట్టబెట్టనుంది. ఈ అవార్డు రేసులో బాగ్దాదీ దూసుకొచ్చాడు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న డోనాల్డ్ ట్రంప్ తో సరిసమానంగా అతడు సత్తా చాటుతున్నాడని ఆ మేగజీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇరాక్, సిరియాల్లో తాను అనుకున్న సొంత రాజ్యాన్ని నిర్మించడంలో బాగ్దాదీ తనదైన శైలిలో తన అనుచరులను ఉత్తేజపరుస్తున్నాడు. అంతేకాక ట్యునీషియా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో భీకర దాడులకు వారిని సర్వసన్నద్ధం చేస్తున్నాడు’’ అంటూ బాగ్దాదీ సత్తాను ఆ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం 8 మందితో కూడిన తుది జాబితాలో బాగ్దాదీ, ట్రంప్ ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.