: కార్యకర్త కోసం కాన్వాయ్ ఆపి వెనక్కి వచ్చిన చంద్రబాబు!
తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రాతిపదికగా పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి కార్యకర్తలే బలం. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రస్థానంలో నేతలు ఎంతమంది పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారు. ఇప్పటికీ గ్రామ స్థాయిలో గట్టి పట్టున్న పార్టీగా టీడీపీకి పేరుంది. ఈ విషయంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కంటే టీడీపీనే ఓ మెట్టు పైన ఉందన్నది ఎవరూ కాదనలేని సత్యం. నిన్న ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పర్యటన సందర్భగా పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలను తనకు ప్రాణ సమానులుగా అభివర్ణించారు. అంతకుముందు నిన్న హైదరాబాదులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు హైదరాబాదులోని తన ఇంటి నుంచి బయలుదేరిన చంద్రబాబుకు అక్కడి ఫుట్ పాత్ పై చంద్రయ్య అనే పార్టీ కార్యకర్త కనిపించారు. అప్పటికే చంద్రబాబు కాన్వాయ్ ఆయనను దాటేసుకుని ముందుకెళ్లిపోయింది. అయితే చంద్రబాబు తన కాన్వాయ్ ను ఆపేసి, అక్కడే కారు దిగి వెనక్కి నడిచి వచ్చారు. చంద్రబాబు తనకోసం వెనక్కి వస్తున్న వైనాన్ని చూసిన చంద్రయ్య పరుగు పరుగున ముందుకు వెళ్లారు. చంద్రబాబు కాళ్లకు నమస్కారం చేశారు. చంద్రయ్యను ఆప్యాయంగా పైకి లేపిన చంద్రబాబు ఆయనతో రెండు నిమిషాలు మాట్లాడారు. దీంతో చంద్రయ్య పులకించి పోయారు. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్ వద్దకెళ్లి కారులో ఎక్కి వెళ్లిపోయారు.