: సుష్మా పాక్ పర్యటన నేడే... పాక్ ప్రధాని, విదేశాంగ మంత్రులతో భేటీ


భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేడు పాకిస్థాన్ పర్యటనకు బయలుదేరనున్నారు. ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ పేరిట పాక్ రాజధాని ఇస్లామాబాదులో జరగనున్న ఐదో వార్షిక సదస్సుకు హాజరుకానున్న భారత ప్రతినిధి బృందానికి సుష్మా నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ నిన్న సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆఫ్ఘానిస్థాన్ కు ప్రాంతీయ సహకారంపై జరగనున్న ఈ సదస్సుకు హాజరుకానున్న సుష్మా... నేడు, రేపు ఇస్లామాబాదులో ఉంటారు. ఈ సందర్భంగా ఆమె పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో పాటు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల భేటీ జరిగిన రెండు రోజుల తర్వాత సుష్మా పాక్ పర్యటనకు వెళుతున్నారు. ఇక ఎన్ఎస్ఏల సుదీర్ఘ భేటీలో జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ తో కలిసి బ్యాంకాక్ చర్చల్లో పాల్గొన్న విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ కూడా సుష్మాతో కలిసి పాక్ వెళుతున్నారు. ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పలు అంశాలు సుష్మా పర్యటన సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. సుష్మా పర్యటనపై ఇటు భారత్ లోనే కాక అటు పాకిస్థాన్ లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ దఫా చర్చలతో ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాలు పునరద్ధరణ కానున్నాయని ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News