: కళ్లల్లో కారం చల్లి రూ.50 లక్షలు చోరీ... హైదరాబాదు శివారులో దారి దోపిడీ
అది హైదరాబాదు-ముంబై జాతీయ రహదారి. రాత్రింబగళ్లు పెద్ద సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉంటుంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు కూడా నిత్యం అక్కడ తిరుగుతూనే ఉంటాయి. అయితే, ఇవేవీ దోపిడీ దొంగలను నిలువరించలేకపోయాయి. జాతీయ రహదారిపై ఎలాంటి జంకూ లేకుండా దారి దోపిడీకి పాల్పడ్డ దొంగలు ఏకంగా రూ.50 లక్షలు ఎత్తుకెళ్లారు. అది కూడా హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డి సమీపంలో. సంగారెడ్డికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న కంది గ్రామ సమీపంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో పత్తి రైతుల కళ్లల్లో కారం చల్లిన దొంగలు వారి నుంచి రూ.50 లక్షలను అపహరించారు. హైదరాబాదు నుంచి మెదక్ జిల్లా సదాశివపేటకు బయలుదేరిన పత్తి రైతులకు సంబంధించిన సమాచారాన్ని ముందే గ్రహించిన దొంగలు కంది సమీపంలో జాతీయ రహదారిపై దారి కాచారు. రైతులు ప్రయాణిస్తున్న కారు అక్కడకు రాగానే దానిపై మూకుమ్మడిగా దాడి చేశారు. రైతులు, కారు డ్రైవర్ కళ్లల్లో కారం చల్లి వారు తేరుకునేలోగానే డబ్బు సంచితో పరారయ్యారు. ఊహించని ఘటనతో షాక్ తిన్న రైతులు వెనువెంటనే సంగారెడ్డి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు.