: కోర్టుకు సోనియా, రాహుల్ గాంధీ?... దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కొడుకు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలన్న వారి పిటిషన్ ను నిన్న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అంతేకాక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న కాంగ్రెస్ నేతల పిటిషన్ ను కూడా హైకోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. దీంతో నేడు మెట్రోపాలిటన్ కోర్టు లో జరగనున్న ఈ కేసు విచారణకు తల్లీకొడుకులిద్దరూ హాజరుకావాల్సి ఉంది. సోనియా, రాహుల్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పార్టీ సీనియర్ నేతలు మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే, శ్యాం పిట్రోడా తదితరులు కూడా నేడు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోనైనా వారికి ఊరట లభిస్తుందా? లేదా? అన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.