: విరాళాల సేకరణలో బీజేపీ టాప్!
ప్రతి ఏటా రాజకీయ పార్టీలు వివిధ సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచి విరాళాలు అందుకుంటాయి. ఈ విరాళాలతోనే పార్టీలు నడుస్తున్నాయని ఆయా పార్టీల నేతలు చెబుతారు. 20 వేల రూపాయలకు పైగా విరాళాలు అందుకున్న పార్టీల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) వెల్లడించాయి. అన్ని జాతీయ పార్టీలకు కలిపి మొత్తం 1,695 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. అధికార పార్టీ బీజేపీ అత్యధిక విరాళాలు కొల్లగొట్టిందని నివేదిక పేర్కొంది. 437.35 కోట్ల రూపాయలతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. గత పదేళ్లుగా విరాళాల వివరాలు వెల్లడిస్తూ వచ్చిన బీఎస్పీ ఈ ఏడాది 20వేల రూపాయలకు పైగా విరాళాలు ఏవీ తమకు అందలేదని తెలిపింది. 2013-14 సంవత్సరానికి గాను బీజేపీ 170.86 కోట్ల రూపాయలు విరాళంగా అందుకోగా, 2014-15 సంవత్సరానికి ఈ విరాళాల మొత్తం 437.35 కోట్ల రూపాయలకు పెరగడం విశేషం. గతేడాది కాంగ్రెస్ 59.58 కోట్ల రూపాయల విరాళం అందుకోగా, ఈ ఏడాదికి 141.46 కోట్ల రూపాయల విరాళం అందుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఎన్సీపీకి 38.82 కోట్ల రూపాయలు, సీపీఎంకి 3.42 కోట్ల రూపాయలు, సీపీఐకి కోటీ 33 లక్షల రూపాయలు విరాళంగా అందినట్టు నివేదిక వెల్లడించింది.