: శాన్ జోస్ నౌకను కొలంబియా కంటే ముందు మేమే కనుక్కున్నాం: ఎస్ఎస్ఏ
300 ఏళ్ల క్రితం భారీ సంపదతో నడిసముద్రంలో మునిగిన శాన్ జోస్ నౌక విషయంలో వివాదం రాజుకుంటోంది. గుప్త నిధులతో నీటమునిగిన వందల ఏళ్ల రహస్యాన్ని ఛేదించామని, శాన్ జోస్ నౌకను కొలంబియా శాస్త్రవేత్తలు గుర్తించారని ఆ దేశాధ్యక్షుడు మాన్యుయల్ శాంటోస్ ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సీ సెర్చ్ ఆర్ముడా అనే సంస్థ మండిపడుతోంది. శాన్ జోస్ ఉన్న ప్రాంతాన్ని తాము 1981లో కనుగొన్నామని చెబుతోంది. ఈ ప్రాంతంలోకి కొలంబియా అక్రమంగా ప్రవేశించిందని సీసీఏ మండిపడుతోంది. శాన్ జోస్ లో ఉన్న సంపద ఎవరికి చెందాలన్న దానిపై ఎస్ఎస్ఏ అమెరికా, కొలంబియా కోర్టుల్లో దావా వేసింది. గతంలో నౌకలో గుర్తించిన సంపద 50 శాతం ఎస్ఎస్ఏకి, మిగిలిన 50 శాతం కొలంబియా ప్రభుత్వానికి చెందుతుందని కొలంబియా న్యాయస్థానం తీర్పు చెప్పిందని, దీనిని కొలంబియా సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని ఎస్ఎస్ఏ చెబుతోంది. నౌకలోని సంపదలో 35 శాతం ఇస్తామని, నౌక పరిసరాల్లోకి అమెరికన్లను వెళ్లకుండా చూడాలంటూ 1984లో చేసుకున్న ఒప్పందాన్ని కొలంబియా ఉల్లంఘించిందని ఎస్ఎస్ఏ ఆరోపిస్తోంది. నౌకలో గుప్త నిధుల సంపద 4 బిలియన్ డాలర్ల నుంచి 17 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఎస్ఎస్ఏ చెబుతోంది. అయితే కొలంబియా మంత్రి కొర్డొబొ మాట్లాడుతూ, కోర్టు తీర్పులన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. దీంతో శాన్ జోస్ వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.