: వెంకన్నకు మూడవ ఘాట్ రోడ్... ఎక్కడ? ఎలా?
తిరుమల కొండపైకి మూడవ ఘాట్ రోడ్డును నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మేరకు మూడవ ఘాట్ రోడ్డు ఎటువైపు ఉండాలి? ఎలా సాగాలి? సాధ్యాసాధ్యాలు... తదితరాంశాలను పరిశీలించాలని టీటీడీ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించింది. దేవదేవుడు శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునే నిమిత్తం తిరుమల కొండపైకి చేరుకునేందుకు ప్రస్తుతం రెండు ఘాట్ రోడ్డు మార్గాలున్న సంగతి తెలిసిందే. మొదటి ఘాట్ రోడ్డును కొండపై నుంచి కిందకు వచ్చేందుకు, రెండవ ఘాట్ రోడ్డును కింద నుంచి పైకి ఎక్కేందుకు వాడుతుండగా, రెండు రోడ్లకూ మధ్య ఓ లింక్ రోడ్డు కూడా ఉంది. కాలినడకన తిరుమల చేరే భక్తుల కోసం, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు, కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ఉంది. కాగా, తిరుమలకు మూడవ మార్గం నిర్మించాలన్న ఆలోచన ఈనాటిది కాదు. గతంలోనే అధికారులు ఈ ప్రయత్నాలు చేశారు. శ్రీవారి మెట్టు మార్గానికి అవతలి నుంచి... అంటే చంద్రగిరి కొండల వైపు నుంచి రహదారికి అనుకూలమని తేల్చారు కూడా. దీంతో పాటు రేణిగుంట వైపు నుంచి కూడా మరో రహదారిని నిర్మించవచ్చని సూచించారు. ఇక వీటిల్లో ఏ మార్గం ఖరారవుతుందో లేదా మరో కొత్త మార్గం తెరపైకి వస్తుందో వేచి చూడాలి.