: 'సారే జహాసె అచ్ఛా హిందూస్థాన్ హమారా' అంటున్న ముస్లిం యువకుడు
డానిష్ అఖ్లాక్ గుర్తున్నాడా? పోనీ ఈ సంఘటన గుర్తుందా? గో మాంసం తిన్నాడనే నెపంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రి సమీపంలో బిసడ గ్రామంలో మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తిని కొట్టి చంపారు కదా? అప్పుడు ఆయనతో పాటు ఆయన కుమారుడు డానిష్ అఖ్లాక్ చావు దెబ్బలు తిన్నాడు. ఢిల్లీలోని ఆసుపత్రిలో వైద్యచికిత్సతో కోలుకుని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కలిశాడు. తానెప్పటికీ బిసడ గ్రామానికి వెళ్లనని చెప్పాడు. తమ కుటుంబంపై దాడికి దిగిన వారంతా చిన్నప్పటి నుంచి తనకు తెలిసినవారేనని చెప్పాడు. ఆ రోజు తాను మరణించినట్టేనని భావించానని డానిష్ పేర్కొన్నాడు. అకారణంగా తమ కుటుంబంపై దాడికి పాల్పడిన ఆ గ్రామానికి ఇక వెళ్లేది లేదని తేల్చి చెప్పాడు. తాను స్కూలు రోజుల్లో కూడా ఎవరితోనూ గొడవపడలేదని అన్నాడు. తన తండ్రిని చంపిన వారిలో 70 శాతం మంది తనకు తెలుసని సీఎం అఖిలేష్ యాదవ్ కు ఆనాటి సంఘటనను వివరించి చెప్పాడు. డానిష్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ పోర్స్ లో విధులు నిర్వర్తిస్తున్న సర్తాజ్ అఖ్లాక్ తో కలిసి చెన్నయ్ లో ఉంటున్నాడు. ఈ ఘటన తరువాత చుట్టుపక్కల వారిని చూసి భయాందోళనలకు గురవుతున్నారా? అని మీడియా డానిష్ ను అడగగా, 'సారే జహాసె అచ్ఛా హిందూస్థాన్ హమారా' అని చెప్పాడు.