: భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్ లో గొప్ప, చెత్త రికార్డులు బోలెడు!
నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీలను గుర్తు చేస్తూ, భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన ఫ్రీడం ట్రోఫీని భారత జట్టు సగర్వంగా అందుకుంది. ఈ టెస్టు సిరీస్ లో ఎన్నో రికార్డులు నమోదు కాగా, వాటిల్లో గొప్పవి, చెత్తవి కూడా ఉన్నాయి. * సౌతాఫ్రికా జట్టు తానాడిన గత 15 సిరీస్ లలో ఎన్నడూ ఓటమిని చవిచూడలేదు. అటువంటి జట్టు భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దాదాపు 9 సంవత్సరాల పాటు ఆ జట్టు కాపాడుకుంటూ వచ్చిన రికార్డు గల్లంతయింది. * ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన 5వ భారత ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే కన్నా ముందు విజయ్ హజారే, గవాస్కర్, ద్రవిడ్, కోహ్లీలు మాత్రమే ఈ ఫీట్ సాధించారు. * ఇక బెస్ట్ ఎకానమీ బౌలర్ గా వరల్డ్ నంబర్ 2 స్థానంలో జడేజా నిలిచాడు. సౌతాఫ్రికాపై 46 ఓవర్లు వేసిన జడేజా కేవలం 26 పరుగులే ఇచ్చాడు. అతని కన్నా ముందు 1964లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో 32 ఓవర్లు వేసిన నద్ కర్ణీ 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. * కనీసం 200 బంతులాడిన ఆటగాళ్లలో అతి తక్కువ స్ట్రయిక్ రేటును హసీమ్ ఆమ్లా సాధించి ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 244 బంతులాడిన ఆమ్లా చేసింది 25 పరుగులే. అతని తరువాత ఇంగ్లండ్ ఆటగాడు రసెల్స్ ఉండగా, మూడవ స్థానంలో నేడు అత్యంత జిడ్డు ఆట చూపిన డివిలియర్స్ నిలిచాడు. * ఓ టెస్టు మ్యాచ్ లో తొలి 50 ఓవర్లకు దక్షిణాఫ్రికా చేసిన 49 పరుగులే అత్యల్పం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2005లో జరిగిన ఆ మ్యాచ్ లో వెస్టిండీస్ స్కోరు 68 పరుగులు. * దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన మ్యాచ్ లలో నాలుగో ఇన్నింగ్స్ కు అత్యధిక పరుగుల టార్గెట్ ఢిల్లీ మ్యాచ్ లోని 481 పరుగులు. * ఓ టెస్టులో 5వ నంబర్ కన్నా దిగువన బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడు రహానే. అంతకుముందు 2008 అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్ 259 పరుగులు చేసి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంతో పాటు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, రహానే 227 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. * ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక మెయిడెన్లు వేసిన టాప్-10 జాబితాలో జడేజా చేరిపోయాడు. 46 ఓవర్లు వేసిన జడేజా వాటిల్లో 33 మెయిడెన్లు వేయడం గమనార్హం. * టెస్టుల్లో భారత్ పై డుమినీ సరాసరి 10.62. డుమినీకి సంబంధించినంత వరకూ ఇదో చెత్త రికార్డే. మరే దేశంలోనూ డుమినీ ఈ 'ఘనత' సాధించలేదు. * ఇక అత్యధిక సేపు ఆడి, అతి తక్కువ పార్ట్ నర్ షిప్ లో తొలి మూడు రికార్డులూ ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా పేరిట చేరిపోయాయి. ఆమ్లా, డెవిలియర్స్ 27 పరుగులు, డెవిలియర్స్, ప్లెసిస్ 35 పరుగులు, ఆమ్లా, బవుమా 44 పరుగులు టాప్ - 3 (కనీసం 200 బంతులు)లో ఉన్నాయి.