: మా దగ్గర ఓపెన్ చెక్ బుక్ ఉంది... పెట్టుబడికి ఎంత కావాలన్నా రాసుకోవచ్చు: అమేజాన్
"ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి మేము వెనుకాడడం లేదు. మా వద్ద ఓపెన్ చెక్ బుక్ ఉంది. ఎంత అవసరమైతే అంత రాసుకోవచ్చు" అని అమేజాన్ ఇండియా అధిపతి అమిత్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. అమెరికా కేంద్రంగా నడుస్తున్న మాతృసంస్థ 89 బిలియన్ డాలర్ల ఆస్తులతో అండగా ఉన్న వేళ, ఇండియాలో పోటీలో ఉన్న ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, పేటీఎం తదితర సంస్థను దాటి మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టిన సంస్థకు పెట్టుబడులకు అవసరమైన నిధుల కొరత లేదని ఆయన వివరించారు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఈ సంవత్సరం 40 వేల కొత్త ప్రొడక్టులను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, దీపావళి సందర్భంగా విక్రయించిన 70 శాతం ఉత్పత్తులను మరుసటి రోజే డెలివరీ ఇచ్చామని తెలిపారు. ఈ సంవత్సరం దాదాపు రూ. 13 వేల కోట్లను ఇండియాలో పెట్టుబడిగా పెట్టామని, భవిష్యత్తులో ఎంతైనా పెట్టగలిగే సామర్థ్యం తమకుందని అమిత్ అభిప్రాయపడ్డారు. భారత ఈ-కామర్స్ మార్కెట్ బుడగ పగులుతుందని వస్తున్న విశ్లేషణలు వాస్తవం కాదని, ఇంకా ఇక్కడ ఆన్ లైన్ వాణిజ్యం తొలి అడుగుల్లోనే ఉందని, తాము స్వల్ప కాలిక లక్ష్యాలను వదిలి దీర్ఘకాల గోల్స్ అందుకునే దిశగా సాగుతున్నామని వివరించారు. లాభాల కన్నా వృద్ధి మార్గమే తమకు ప్రధానమని అన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో పన్ను వివాదాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకుంటామని, ఈలోగా ఇతర ప్రాంతాల్లో విస్తరణకు యత్నిస్తున్నామని తెలిపారు.