: తలసానికి ‘మర్రి’ ఫోన్... లిఫ్ట్ ప్రమాదంలో గాయపడ్డ మంత్రికి పరామర్శ
లిఫ్ట్ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు ఆయన రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫోన్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో హైదరాబాదులోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తలసాని, మర్రి శశిధర్ రెడ్డిని ఓడించారు. అంతకుముందు సికింద్రాబాదు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన తలసాని మొన్నటి ఎన్నికల్లో సనత్ నగర్ కు మారారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన తలసాని మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తలసానిని అనర్హుడిగా ప్రకటించాలని మర్రి శశిధర్ రెడ్డి న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నేటి ఉదయం ఎర్రగడ్డలోని సెయింట్ థెరిస్సా ఆసుపత్రికి వెళ్లిన తలసాని లిఫ్ట్ ప్రమాదంలో చిక్కుకున్నారు. మంత్రి ఎక్కిన లిఫ్ట్ పై నుంచి ఒక్కసారిగా కిందపడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో తలసాని స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే మర్రి శశిధర్ రెడ్డి రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి తలసానికి ఫోన్ చేశారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. తనకు ఫోన్ చేసి పరామర్శించిన శశిధర్ రెడ్డికి తలసాని కృతజ్ఞతలు తెలిపారు.