: కారణం కల్తీ మద్యం కాదు... వాటర్ కూలర్ లో ఎవరో, ఏదో కలిపారు: మాజీ ఎమ్మెల్యే మల్లాది


విజయవాడ కృష్ణలంకలోని స్వర్ణ బార్ లో నేటి ఉదయం వెలుగుచూసిన దారుణానికి కల్తీ మద్యం కారణం కాదని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. కల్తీ మద్యం కారణంగానే జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు మరణించగా, 20 మంది దాకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలోనూ చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ సందర్భంగా 'స్వర్ణ బార్' మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని టీడీపీ సీనియర్ నేత, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆరోపించారు. దీంతో క్షణాల్లో మీడియాకు అందుబాటులోకి వచ్చిన మల్లాది విష్ణు బార్ తనది కాదని, తన బంధువులదని ప్రకటించారు. అయినా ఈ ఘటనకు కల్తీ మద్యం కారణం కాదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గుర్తు తెలియని కొందరు దుండగులు బార్ కు చెందిన వాటర్ కూలర్ లో ఏదో కలిపారని, ఈ కారణంగానే దారుణం చోటుచేసుకుందని ఆరోపించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించాలని ఆయన కోరారు. బార్ లో కొన్న మద్యాన్ని మినరల్ వాటర్ తో కలుపుకుని సేవించిన వారి పరిస్థితి బాగానే ఉండగా, వాటర్ కూలర్ లోని నీటితో కలుపుకుని తాగిన వారే అస్వస్థతకు గురవడం ఇందుకు నిదర్శనమని మల్లాది చెప్పుకొచ్చారు. ఈ కుట్రకు పాల్పడ్డవారు ఎవరన్న విషయాన్ని త్వరలోనే తేలుస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News