: గొంతులో అలా ఒంపుకున్నారు... ఇలా పడిపోయారు!
విజయవాడలో నేటి ఉదయం కల్తీ మద్యం కారణంగా ముగ్గురు మృత్యువాతపడిన ఘటన పెను కలకలం రేపుతోంది. ఘటన జరిగిన తీరును స్థానికులు మీడియాకు కళ్లకు కట్టారు. నగరంలోని కృష్ణలంకలో మెజారిటీ ప్రజలు దినసరి కూలీలే. ఇక అక్కడ ఏర్పాటైన స్వర్ణ బార్ వద్ద నిత్యం రద్దీ వాతావరణమే. పనులకు వెళుతున్నప్పుడే కాక, ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనూ స్వర్ణ బార్ వద్ద ఆగుతున్న కూలీలు మద్యం సేవిస్తుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. నేటి ఉదయం ముగ్గురు మృత్యువాతపడిన ఘటనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఉదయమే పనికి వెళుతున్న సందర్భంగా పలువురు కూలీలు స్వర్ణ బార్ వద్ద మద్యం సేవించారు. ఈ సందర్భంగా మద్యం సేవించిన మరుక్షణమే కూలీలంతా ఎక్కడికక్కడ పడిపోయారు. కొంతమంది బార్ వద్దే పడిపోగా, మరికొంత మంది అక్కడి నుంచి వెళుతూ వీధుల్లో పడిపోయారు. ఇలా ఉన్నట్టుండి నేలపై పడిపోతున్న వారిని చూసిన స్థానికులు వెనువెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో పాటు అంబులెన్స్ కూ ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేలోగానే ఘోరం జరిగిపోయింది. కల్తీ మద్యం తాగి పడిపోయిన వారిలో ముగ్గురు వ్యక్తులు వారు పడిపోయిన చోటే ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారంతా ఒకే బ్రాండ్ కు చెందిన చీప్ లిక్కర్ సేవించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ బార్ లో మద్యం సేవించిన వారు కొంతమంది గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారని కూడా సమాచారం. క్షణక్షణానికో కొత్త విషయం వెలుగుచూస్తున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను వెలికితీసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.