: కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదు: దానం నాగేందర్
టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ దానం నాగేందర్ పై వస్తున్న వరుస కథనాలకు ఆయనే తాజాగా స్పష్టమైన వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ లో చేరమని తనను అడిగిన మాట వాస్తవమేనన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారతానని పదే పదే అంటూ తన మనసును బాధ పెట్టొద్దని మీడియాను కోరారు. పార్టీలో పొమ్మనలేక పొగపెట్టిన మాట వాస్తవమేనని ఆరోపించారు. హైదరాబాద్ లో పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇంట్లో సమావేశానంతరం దానం విలేకరులతో ఈ మేరకు మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తున్నట్టు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై రేపు సమావేశం అవుతున్నట్టు చెప్పారు. రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాల కోసమే షబ్బీర్ ఇంట్లో ఈ రోజు భేటీ అయ్యామని వివరించారు. ఎన్నికల వ్యూహాన్ని కూడా రేపు ఖరారు చేస్తామని తెలిపారు.