: సాయం చేద్దామని వచ్చిన 100 మంది సైనికులను 10 గంటలు కూర్చోబెట్టిన అధికార 'తంబీ'లు!
తీవ్రమైన వరద తరవాత సహాయక, పునరావాస చర్యలు తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో ఎంత మందకొడిగా సాగుతున్నాయో తెలిపేందుకు మరో ఉదాహరణ ఇది. చెన్నైలో సహాయం చేసేందుకు హైదరాబాద్ నుంచి 100 మంది సైనికులు, మర పడవలు, సహాయ సామాగ్రి తీసుకుని వచ్చారు. వారు ఎక్కడికి వెళ్లాలి? ఎవరికి సహాయపడాలి? ఇటువంటి విషయాలు చెప్పేందుకు ఎవరూ లేక, తమిళ అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు స్పందించక, దాదాపు 10 గంటల పాటు వారు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల నిర్వాకం వల్లే ఇలా జరిగిందని లెఫ్టినెంట్ కల్నల్ రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. తమకు చెన్నై నగరం గురించిన సమాచారం తెలియని కారణంగానే ఎక్కడ తమ అవసరం ఉందో గుర్తించలేక ఖాళీగా ఉన్నామని ఆయన అన్నారు. ఉదయం 6:30కి చెన్నై చేరిన వారికి మధ్యాహ్నం 3:30 తరువాత ఎక్కడికి వెళ్లాలో చెప్పారట. ఇదే విషయమై చెన్నై మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఇంళంగోవన్ స్పందిస్తూ, అటువంటిదేమీ లేదని, తాము సైన్యానికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నామని వెల్లడించడం గమనార్హం.