: సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్... బెయిల్ షరతులను సడలించాలని వినతి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న సీబీఐ ప్రత్యేక కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో జగన్ పై సీబీఐ మొత్తం 11 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గతంలో 16 నెలల పాటు జైల్లో ఉన్న జగన్ బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. బెయిల్ మంజూరు సందర్భంగా హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు జగన్ కు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే పలు సందర్భాల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించిన కోర్టు పూర్తి స్థాయి షరతులను మాత్రం సడలించలేదు. బెయిల్ లభించి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జగన్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ షరతులను పూర్తిగా తొలగించాలని సదరు పిటిషన్ లో ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.