: మోదీపై ఆత్మహుతి దాడికి లష్కరే ప్లాన్!... ప్యారిస్ తరహా వ్యూహానికి పథక రచన


ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేసేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పక్కా ప్లాన్ రచించిందట. ప్యారిస్ లో ఐఎస్ ఉగ్రవాదులు విరుచుకుపడిన తరహాలోనే మోదీపై దాడి చేయాలని కూడా ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు పథక రచన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ దాడి చేయాలని భావించారు. అయితే నిఘా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ దాడికి చెక్ పడింది. దేశంలోకి చొరబడ్డ నలుగురు లష్కరే ముష్కరుల కోసం ప్రస్తుతం ఢిల్లీ సహా జమ్మూ కాశ్మీర్ లోనూ ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. లష్కరే రచించిన ప్లాన్ వివరాల్లోకెళితే... లష్కరే కమాండర్ అబు డూజాన్ తన ముఖ్య అనుచరుడు అబు ఉకాషాతో కలిసి కొంతకాలంగా జమ్మూ కాశ్మీర్ లో మకాం వేశాడు. అతడి ఆదేశాలతో నలుగురు లష్కరే ఉగ్రవాదులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చారు. నిత్యం డూజాన్ తో సంప్రదింపులు జరుపుతున్న వారు బహిరంగ సభలో మోదీ పాల్గొనే సమయంలో ఆత్మహుతి దాడితో విరుచుకుపడాలని తొలుత పథకం రచించుకున్నారు. ఈ తరహా దాడితో ప్రధానితో పాటు పలువురు కీలక నేతలకు కూడా హాని చేయొచ్చన్నది ఉగ్రవాదుల పథకం. ఇది సాధ్యంకాని పక్షంలో ప్యారిస్ తరహాలో కాల్పులకు తెగబడాలని కూడా ఉగ్రవాదులు పథకం రచించుకున్నారు. ఇందులో భాగంగా వీరు ఐఎస్, ఆల్ కాయిదా సంస్థలకు చెందిన కీలక ఉగ్రవాదుల సలహాలు తీసుకున్నారు. గత నెల 24న కాశ్మీర్ లో లష్కరే సానుభూతిపరుడు షాబిర్ అహ్మద్ మాలిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిని విచారించిన సందర్భంగా ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. వీరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్న పోలీసులు మిగిలిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News