: కాలిఫోర్నియా దాడి ముమ్మాటికీ ఉగ్రవాద చర్యే... ఐఎస్ ను తుదముట్టిస్తాం: బరాక్ ఒబామా ప్రతిన


ఉగ్రవాదాన్ని తుద ముట్టించేదాకా విశ్రమించేది లేదని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతినబూనారు. కాలిఫోర్నియా దాడి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాకిస్థాన్ కు చెందిన దంపతులు కాలిఫోర్నియాలో జరిపిన దాడి ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆయన పేర్కొన్నారు. ‘‘వారు బుల్లెట్లతో నిండిన మారణాయుధాలు, మందు గుండు సామగ్రి, పైపు బాంబులు చేతబట్టి వచ్చారు. దీంతో వారి దాడి ముమ్మాటికీ ఉగ్రవాద దాడే’’ అని ఒబామా తేల్చిచెప్పారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను దొంగలు, హంతకులుగా అభివర్ణించిన ఆయన, వారిని సమూలంగా తుడిచిపెట్టేస్తామని ప్రతినబూనారు. ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న మాట వాస్తవమని ఒప్పుకున్న ఒబామా, దానిని అణచివేస్తామని ప్రకటించారు. తమకు హాని చేసే ఐఎస్ఐఎల్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లావెంట్) సహా, దానితో జట్టు కట్టే ఏ గ్రూపునైనా అంతం చేసేస్తామని పేర్కొన్నారు. అర్హత లేని ఏ ఒక్క వ్యక్తి కూడా తుపాకి కొనుగోలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News