: చింటూ రాయల్ పై ఈడీ గురి!... కోట్లాది అక్రమాస్తులపై కూపీ లాగుతున్న వైనం


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ ల హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో కీలక నిందితుడు, కఠారి మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ కోట్లాది రూపాయల అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీయడంలో మాత్రం విఫలమయ్యారు. వందల కోట్ల అక్రమాస్తులను చింటూ కలిగి ఉన్నాడన్న సమాచారంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. నిన్న హైదరాబాదు నుంచి చిత్తూరు చేరుకున్న ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ నేరుగా జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తో భేటీ అయ్యారు. చింటూ అక్రమాస్తులకు సంబంధించి అప్పటిదాకా పోలీసులు సేకరించిన సమాచారాన్ని ఆయన ఎస్పీ వద్ద నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత చింటూ ఇల్లు, కార్యాలయాన్ని కూడా లక్ష్మీకాంత్ పరిశీలించారు. మరో రెండు రోజుల పాటు ఆయన చిత్తూరులోనే మకాం వేయనున్నట్లు సమాచారం. అక్రమాస్తుల గుట్టు విప్పేందుకు అవసరమైతే, చింటూను తమ కస్టడీలోకి తీసుకునే విషయాన్ని కూడా లక్ష్మీకాంత్ పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News