: సోమవారం బేసి సంఖ్య... మంగళవారం సరి సంఖ్య... ఢిల్లీలో వాహనాలకు నిబంధనలు!
ఢిల్లీలో జనవరి 1 నుంచి నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి రానున్నాయని ఆ రాష్ట్ర హోం మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. ఢిల్లీలో కాలుష్య నివారణకు కళ్లెం వేసేందుకు సరికొత్త ప్రణాళిక అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. జనవరి ఒకటి నుంచి ప్రతి ఒక్కరూ తమ వాహనాలు రోజు విడిచి రోజు గ్యారేజ్ నుంచి బయటకు తీయాలని ఆయన సూచించారు. వారంలోని సోమ, బుధ, శుక్ర వారాల్లో వాహన సంఖ్యలో చివరన బేసి సంఖ్య కలిగిన వాహనాలు రోడ్లపైకి తీసుకురావచ్చని, అలాగే మంగళ, గురు, శని వారాల్లో వాహన సంఖ్యలో చివరన సరి సంఖ్య కలిగిన వాహనాలు రోడ్లపైకి రావాలని సూచించారు. ఈ నిబంధనలు ప్రతి ప్రైవేటు వాహనానికి కూడా వర్తిస్తాయని, దీనికి ఎవరూ అతీతులు కాదని, ప్రజా ప్రతినిధులు, వీఐపీలు, లాయర్లు, ప్రభుత్వాధికారులు, ఎవరికైనా సరే అదే నిబంధన అని, తాను కూడా రోజు విడిచి రోజే వాహనం తీస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అంబులెన్సులకు, ఫైర్ టెండర్స్, పీసీఆర్ వ్యాన్స్, ప్రభుత్వ వాహనాలకు వర్తించవని ఆయన చెప్పారు.