: కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీకి కేడర్ లేని ప్రాంతాల్లోని తమ నేతలను పార్టీలోకి చేర్చుకుని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పార్టీ బలం పెంచుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు విధానాల ద్వారా నేతల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించిన రాజ్యాంగ నిర్మాత అందుకే కొన్ని విధివిధానాలు రూపొందించారని, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వం ఫిరాయింపులకు తెరతీయడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.