: టాక్స్ పేయర్స్ కు శుభవార్త... రూ. 50 వేల కన్నా లోపు రిఫండ్స్ వెంటనే!
ఇండియాలో ఆదాయపు పన్ను శాఖకు పన్ను చెల్లించి, రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న టాక్స్ పేయర్స్ కు శుభవార్త. రూ. 50 వేల కన్నా తక్కువగా ఉన్న మొత్తాలను తక్షణమే వెనక్కు ఇవ్వాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రూ. 5,400 కోట్ల పెండింగ్ రిఫండ్స్ పన్ను చెల్లింపుదారులకు చేరాల్సివుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) అధికారులతో రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా జరిపిన సమీక్ష తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు రిఫండ్స్ ఆలస్యం అవుతున్నాయని పన్ను చెల్లింపుదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్యను తగ్గించేందుకు తీసుకోనున్న చర్యల్లో భాగంగా, రూ. 50 వేల కన్నా తక్కువ మొత్తాలను, స్క్రూటినీ లేకుండానే సాధ్యమైనంత త్వరగా ఇచ్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, 2013-14 అసెస్ మెంట్ సంవత్సరానికి సంబంధించి 2.07 లక్షల మందికి రూ. 659 కోట్లను ఇవ్వాల్సి వుండగా, 2014-15కు సంబంధించి 12.9 లక్షల మందికి రూ. 4,837 కోట్లను రిఫండ్ గా ఇవ్వాల్సి వుంది. ఈ రిఫండ్స్ పూర్తయితే, పెండింగ్ కేసుల్లో 80 శాతం వరకూ పరిష్కరించబడ్డట్టేనని తెలుస్తోంది.