: సీపీఐ ధర్నాలో కాంగ్రెస్ ఎంపీలు: రఘువీరారెడ్డి
రేపు ఢిల్లీలో సీపీఐ చేపట్టనున్న ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు పలుకుతోందని, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఈ ఉదయం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో వివిధ పార్టీల నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు భాగం కానున్నారని ఆయన వివరించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ తాము ఎందరో కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం సీపీఐ కేంద్రంతో పోరాడుతుందని, సమస్యలను అర్థం చేసుకుని మెలగాలని సీపీఐ రాజ్యసభ సభ్యుడు డి.రాజా వ్యాఖ్యానించారు. హోదా ఇవ్వాలన్న ఉద్దేశం కేంద్ర మంత్రుల్లో కనిపించడం లేదంటూ ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని పార్టీలూ రాజకీయాలను పక్కనబెట్టి ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.