: నరేంద్ర మోదీపై ఉగ్రకుట్ర భగ్నం!


ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రముఖ రాజకీయ నేతల హత్యకు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చేసిన కుట్ర భగ్నమైంది. ఇంటెలిజన్స్ బ్యూరో, పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం నలుగురు ఉగ్రవాదుల వరకూ చొరబడ్డారని, వీరంతా లష్కర్ కమాండర్ అబూ దుజానాతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. గత వారంలో ఐఎస్ఐ గూఢచారులను అదుపులోకి తీసుకున్న తరువాత, ఈ చొరబాట్లు, మోదీపై ఉగ్రకుట్ర గురించిన సమాచారం పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, నిఘా వర్గాలు ముందడుగు వేసి ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంలో విజయం సాధించినట్టు సమాచారం. వీరు రెండు ప్లాన్ లతో వచ్చారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మోదీ పాల్గొనే ఏదైనా కార్యక్రమంలో 26/11 తరహాలో విరుచుకుపడాలన్నది వీరి ప్రధాన లక్ష్యమని, అక్కడ మోదీని హతమార్చడం కుదరదని భావిస్తే, దగ్గరకు వెళ్లి తమను తాము పేల్చుకోవడం ద్వారా ప్రయత్నించాలన్నది వీరి ఉద్దేశమని తెలిపాయి. రాజకీయ, మత అశాంతిని పెంచడమే లక్ష్యంగా వీరు వచ్చారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదుల అరెస్టుతో పెను కుట్రను భగ్నం చేయగలిగినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News